తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ద్వారా ఆదరణ కార్యక్రమాల కోసం అందించే ప్రతి రూపాయీ సద్వినియోగం చేస్తామని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జైశంకర్, తానా ట్రస్టీ రవి సామినేని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవనిగడ్డ లోని స్థానిక గాంధీక్షేత్రంలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడ్లంక గ్రామ విద్యార్థినులు 25 మందికి ఏర్పాటు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ ఆదరణ కార్యక్రమం ద్వారా కంటి, కాన్సర్ వైద్య పరీక్షలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13 లక్షల డాలర్లు పేద వర్గాలకు అందించడం ద్వారా నిధులు సద్వినియోగం చేసినట్లు తెలిపారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నప్పటికీ మాతృభూమిని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్లంక బాలికలు నదిని దాటి 3 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారని చెప్పగానే 25 మందికి సైకిళ్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా కాబోయే అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, నైనుపాటి విశ్వనాథ్, తానా ఫౌండేన్ ట్రస్టీ రవి సామినేని, కిలారు ముద్దుకృష్ణ చావా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
