బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన డివోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ2 : తాండవం. బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఎప్పుడొచ్చిందని కాదు. వచ్చి ఏ స్థాయిలో ప్రభావం చూపించిందనేది ముఖ్యం. ఇందులో ప్రతి సీన్ ఒక ఉద్వేగం, ఉద్రేకం, ఒక ఉత్తేజ ప్రకంపనం. మనిషే దేవుడైతే ఏమవుతుందో అదే అఖండ 2: తాండవం. ఇంతటి ఘనవిజయాన్ని మీకు మీరిచ్చుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు.

ఈ సినిమాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేం బాధపడలేదు. దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. అదే జరిగింది. విడుదల తేదీ మారడం వల్ల థియేటర్లు తగ్గాయి. వసూళ్లు చూశాక ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి. మనం గెలవడం కాదు, సినిమా గెలవాలి. తెలుగు సినిమా పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. పొద్దున లెగిస్తే ముఖముఖాలు చూసుకోవాలి. బయటి వాళ్లు చూసి హేళన చేసేలా మనం ఉండకూడదు అని దర్శకుడు బోయపాటి శ్రీను హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు దిల్‌రాజు, గంగాధర శాస్త్రి తదితరులు కూడా పాల్గొన్నారు.















