అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ నెల 18న కాకినాడలో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ ఏజెంట్ సినిమా ఎన్నో మరపురాని అనుభవాల్ని మిగిల్చింది. శారీరకంగా, మానసికంగా నా జీవితంలో గొప్ప మార్పుని తీసుకొచ్చింది అన్నారు. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడాల్సి ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి ముందే చెప్పారు. ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని ఆరోజే ఆయనకు మాటిచ్చాను. సినిమాలో నేను సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నానంటే ఆ క్రెడిట్ సురేందర్ రెడ్డిదే. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది అన్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కోసం అఖిల్ చాలా శ్రమించాడు. దాదాపు ఏడాది పాటు ఒకే రకమైన ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేశాడు. అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైనదీ చిత్రం. అతను ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ఈ సినిమా ద్వారా అఖిల్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని గర్వంగా చెబుతున్నా అని పేర్కొన్నారు. ఈ సినిమా అందరి అంచనాల్ని అందుకుంటుందని, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినందిస్తుందని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. తన కెరీర్‌లోనే ఇదొక అద్భుత అవకాశమని హీరోయిన్ సాక్షి వైద్య పేర్కొంది. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.