హైదరాబాద్‌లో దివికేగిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ జయంతి వేడుకల్ని కళాతపస్వికి కళాంజలి పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌తో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికల్ని అందజేశారు. ఈ సందర్భంగా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ కళాతపస్వి కె.విశ్వనాథ్ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని, ఆయన తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. నటనలో సున్నితమైన భావోద్వేగాల్ని ఎలా పలికించాలో విశ్వనాథ్‌గారి నుంచే నేర్చుకున్నా. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని నేటితరం వారు ఎదగాలని కోరుకుంటున్నా అన్నారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ భాషా భేదాలతో సంబంధం లేకుండా ఆనాడే పాన్ ఇండియా సినిమాలు చేసిన ఘనత కె.విశ్వనాథ్ సొంతం.భవిష్యత్తు తరాలకు సినిమాల పరంగా ఆయనొక విజ్ఞాన నిధి. అన్నమయ్య, శ్రీమంజునాథ చిత్రాలతో నా జన్మధన్యమైందని ఆయన నన్ను మెచ్చుకునేవారు అని చెప్పారు. దర్శకత్వానికి దైవత్వాన్ని ఆపాదించిన గొప్ప దిగ్గజం కె.విశ్వనాథ్ అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం చిత్రంతో తెలుగు రాష్ర్టాల్లో సంగీత పాఠశాలలు వెలిశాయని, అంతలా ఆయన మన సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ పెంచుకునేలా చేశారని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, మురళీమోహన్, మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, రోజా రమణి, భానుచందర్, మీనా, జయసుధ, రాధిక, సుమలత, ఆమని, సి.అశ్వనీదత్, ఏడిద శ్రీరామ్, కాశీవిశ్వనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, కె.ఎస్.రామారావు, తనికెళ్ల భరణి, జీవిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.