తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు సభ్యులు వివిధ నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల నియోజక వర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సౌత్ ఆఫ్రికా శాఖ సెక్రటరీ జనరల్ మేడసాని నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ అభ్యర్థుల కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల క్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. చేవెళ్ల నియోజకవర్గానికి వందలాది కోట్ల రూపాయలను మంజూరు చేయించి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.