ఆస్ట్రేలియాలో భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు విదేశాల్లో పీవీ నరసింహా రావు ఘనతను స్మరించుకునేలా విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో భాగంగా ఆస్ట్రేలియాలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం. ప్రధానమంత్రి హోదాలో దేశానికి పీవీ అపూర్వ సేవలందించారు. 1991 ఆర్థిక సంక్షోభ సమయంలో తీసుకున్న సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక రంగంలోకి చేర్చిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. కేసీఆర్ నాయకత్వంలో శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ఉద్యమాన్ని ఎన్ఆర్ఐ వేదికలపైనా విస్తరించి, గ్లోబల్ పిటిషన్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పొందేలా పిలుపునిచ్చారు. పీవీ జీవితసాధనను గుర్తించి భారతరత్న ప్రకటించాలని ఎన్నో దేశాల్లో నివాళుల కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో పీవీ ఘాట్ నిర్మాణం, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రత్యేక నివాళులర్పించడం వంటివి ఆయనకు అర్పించిన నిబద్ధతకు నిదర్శనాలు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆయనకు భారతరత్న రావాలన్న ఉద్యమం ప్రజల ఆశయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు చురుకుగా పాల్గొనడం గర్వంగా ఉంది. ఈ పోరాట ఫలితంగా పీవీ నరసింహారావు భారతరత్న ప్రకటించబడింది. ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకారం అందించిన స్థానిక కౌన్సిల్‌కు, స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిలర్ సాండీ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ భారతి రెడ్డి, నారాయణ రెడ్డి, సాండీ రెడ్డి, యతిన్ గుప్తా, రాజేశ్, లివింగ్‌స్టన్ చిటపల్లి, కిషోర్, రాజ్ కుమార్, కరీ రెడ్డి పాల్గొన్నారు.
