ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో దిగ్గజ సెర్చింజన్ గూగుల్ కూడా చర్యలు చేపట్టింది. గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దానిపై ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. ఉద్యోగుల తొలగింపును సమర్ధించుకున్నారు. సరైన సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేదంటే పరిస్థితి మరింత జఠిలంగా మారే అవకాశం ఉందన్నారు. . కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.