ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతున్నది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలింపును వేగవంతం చేసిన కేంద్రం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తున్నది. తాజాగా ఖర్కివ్‌లో ఉన్న భారతీయులకు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది. రష్యా బలగాలు యుద్ధాన్ని మరింత ఉధృతం చేసిన నేపథ్యంలో ఖర్కివ్‌ను వెంటనే విడిచి వెళ్లిపోవాలని భారత ఎంబసీ కోరింది. పెసోచిన్, బబాబే, బెజ్లిడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవాలని వెల్లడిరచింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల కల్లా సూచించిన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అక్కడ ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారత దేశ జెండా పట్టుకొని ఖార్కివ్‌లో గుంపులు గుంపులుగా నడుస్తూ రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో భారత్ నుంచి విద్యార్థులు, కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారంతా భారత జాతీయ జెండాను పట్టుకని సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లకు వెళ్తున్నట్లు ఓ విద్యార్థి తండ్రి తెలిపాడు.