అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఆటా వేడుకలు 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ రవీంద్రభారతి లో వైభవంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలతో సభా ప్రాంగణం కళకళలాడిరది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ఆటా చేపట్టిన ఈ కార్యక్రమం సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై తెలుగు భాషకు సంస్కృతికి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్న ఆటా సేవలను కొనియాడారు.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ 2016 నుండి అమెరికాలో తెలుగు జనాభా నాలుగు రెట్లు పెరిగిందని, వారి శ్రేయస్సు కోసం ఆటా నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. కేవలం సంస్కృతిని కాపాడటమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, ఆటా ప్రయాణం ఒక సేవాయాత్ర అని అభివర్ణించారు. అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగు వారి విజ్ఞానం, అనుభవం మాతృభూమి అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే తమ ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

ప్రముఖ సినీ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డికి ఆటా జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. వివిధ విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్య, సామాజిక సేవ రంగాల్లో సేవలందించిన వారిని సత్కరించారు. వేడుకల్లో సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు అలరించాయి. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు సంస్కృతితో ఉన్న అనుబందధం ఈ ప్రదర్శనల్లో కనిపించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాబోయే అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆటా లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను వారు వివరిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.















