నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం తండేల్. సాయిపల్లవి కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో నాగచైతన్య ముచ్చటించారు. తండేల్ సినిమా నా కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రం. దర్శకుడు చందుతో నాకిది మూడో సినిమా. నన్ను కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమా కథను మొదట చందు చెప్పినప్పుడు అది డాక్యుమెంటరీలాగా అనిపించింది. సినిమాటిక్గా తయారు చేయమని చెప్పా. కొన్ని మార్పులు చేసి అద్భుతంగా మార్చారు. ఈ కథ వినే సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఇందులో నా పాత్ర తండేల్ రాజు కోసం చాలా శ్రమపడ్డాను. శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఉండే మత్య్సకారుల జీవితాలను, వారి వేషభాషలను గమనించాను. ఒక నటుడిగా ఈ సినిమాతో నేనో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను.ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉండడం వల్ల చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే, సెకండ్ ఆఫ్ మరో వీర లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కథే ఈ సినిమాకు హీరో. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమా చివరి 30 నిమిషాలు చాలా బాగా నచ్చేసింది. క్లైమాక్స్ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రం ఓ నటుడిగా నన్ను మరోస్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. తండేల్రాజు, సత్య ప్రేమ కథ తప్పకుండా అందరి హృదయాలను గెలుచుకుంటుంది అని చెప్పారు.