ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరాన్ని రష్యా దళాలు వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా ప్రకటించింది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఖేర్సన్ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడిరచింది. సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ పరిణామాన్ని కీలక విజయంగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సైతం ఖేర్సన్ నగరం ఇక మాదే అంటూ ప్రకటించారు. మన ప్రజలు, మన ఖేర్సన్ అంటూ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు.