
అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని, ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం, భారత్ చర్యలను తాము బహిరంగ పర్చడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ఎలాన్‌మస్క్ నేతృత్వం లోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది.

ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110 శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రపంచం లోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా అభివర్ణించారు. తన సంస్థను సుంకాలు లేకుండా భారత్‌లో ప్రవేశ పెట్టడానికి మస్క్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ క్రమం లోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే భారత్‌మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
