అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 12,500 ఏండ్ల కిందట అంతర్థానమైపోయిన జీవులను మళ్లీ సృష్టించారు. జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా 12 వేల సంవత్సరాల కిందట భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్‌లకు (భయంకరమైన తోడేళ్లు) మళ్లీ ప్రాణం పోశారు. టెక్సాస్‌కు చెందిన కొలొసస్ బయోసైన్సెస్ సంస్థ వీటికి మళ్లీ ప్రాణం పోసింది. ఆరు నెలల వయసున్న రొములస్, రెముస్ ఇప్పటికే నాలుగు అడుగుల పొడవు, 36 కిలోల బరువు ఉండటం విశేషం.

డైర్ వోల్ఫ్ అనేవి భయంకరమైన వేటాడే జంతువులు. చాలా ఎత్తు ఉండే ఇవి ఉత్తర అమెరికాలో జీవించేవి. అంతర్థానమైపోయిన ఓల్ఫ్ డీఎన్‌ఏ, వీటిని పోలి ఉండే గ్రే వోల్ఫ్ డీఎన్‌ఏల క్లోనింగ్, జన్యు మార్పిడి ద్వారా వీటికి తిరిగి ప్రాణం పోశారు. ఇవి గ్రే వోల్ఫ్ కంటే చాలా పెద్దవి. అంతేకాదు, మందమైన ఉన్నితో పాటు వేటాడేందుకు వీలుగా దృఢమైన దవడ కలిగి ఉండేవి. 13 వేల ఏండ్ల కిందటి పన్ను, 72 వేల ఏండ్ల కిందటి పుర్రెల ద్వారా తమ శాస్త్రవేత్తల బృందం డీఎన్‌ఏలను సేకరించి, పరిశోధనలు జరిపినట్టు కొలొసల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బెన్ లామ్ వెల్లడించారు. 2024 అక్టోబర్ 1న రెండు మగ ఓల్ఫ్‌లు, 2025 జనవరి 30న ఒక ఆడ వోల్ఫ్‌కు పరిశోధకులు ప్రాణం పోశారు. ప్రస్తుతం జీవించి ఉన్న ఇతర జాతుల తోడేళ్లతో పోలిస్తే వీటి ప్రవర్తన కాస్త భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు.
