ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత అతనికి ముంబైలోని ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి గత నెల (నవంబరు ) 27న విశాఖ చేరుకున్నాడు. అక్కడ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. కాగా, తాజాగా ఆ వ్యక్తికి మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వ్యక్తి నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్షల కోసం పంపించారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
మొత్తం 15 మంది నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, పది నమూనాలలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు తెలిపారు. మిగలిన ఐదుగురి వివరాలు రావాలన్న ఆరోగ్యశాఖ ప్రజల అనవసర వదంతులు నమ్మవద్దని తెలిపింది. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది. ఒమిక్రాన్ వేరియంట్ సోనిక వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.