రాష్ట్రంలో వినాయక చవితి అంటే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడు. ఏటా విభిన్న రూపాల్లో దర్శణమిచ్చే మహా గణపతి ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా భక్తులను కనువిందు చేయనున్నాడు. ఖైరతాబాద్ గణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వైభవంగా జరిగిన తొలిపూజలో గవర్నర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు ఉన్న మహా గణపతి విగ్రహాన్ని మట్టితో తయారుచేశారు. మండపానికి రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. కాగా, ఖైరతాబాద్ లంబోదరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

