
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. ఒహాయోలోని వాన్స్ నివాసంపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని సిన్సినాటి పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇంటి కిటికీల అద్దాలు పగిలిపోయాయని పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో వాన్స్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంటిలో లేరని తెలిపారు. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో జరిగిన దాడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సిన్సినాటి పోలీసులకు సమాచారం అందించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి వాన్స్‌ను లక్ష్యంగా చేసుకొని జరిగిందా అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం నిర్బంధించిన సమయంలో వాన్స్ తన ఒహాయోలోని నివాసానికి వెళ్లారు. వాన్స్ ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం అర్ధరాత్రి దాడి జరిగినట్టు తెలుస్తున్నది.















