తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న జరపాలని అనుకున్న తెలంగాణ విజయగర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. నాటి ఉద్యమ రధసారథిగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సీఎం కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణాత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన దీక్షా దివాస్ రోజే జరపాలన్న వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్ తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29వ తేదీకి వాయిదా వేశారు.