తెలుగు సినీ జర్నలిస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సీనియర్ సినీ జర్నలిస్టు వినాయక రావు రచించిన తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కెరీర్ ఆరంభం నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తున్నా. వారికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నా తప్పులను ఎత్తిచూపి నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు.కలం సైనికులైనటువంటి జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబించే వార్తలను రాసినప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వినాయక రావు ఏ పుస్తకాన్ని రాసినా లోతైన విశ్లేషణ చేస్తారు. అరుదైన ఫొటోలను సేకరిస్తుంటారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు.
తాను రాసిన పన్నెండవ పుస్తకం ఇదని, టాకీ కాలం నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమగ్ర సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచానని రచయిత వినాయక రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభు, రెంటాల జయదేవతో పాటు పలువురు సినీ జర్నలిస్టులు పాల్గొన్నారు.