తమ లక్ష్యాన్ని సాధించేంతవరకూ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. వ్లాదివొస్తోక్‌లో ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంక్షలు విధించడం ద్వారా తమను అడ్డుకునేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తుండటాన్ని ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. ఆ దేశాల ఆర్థిక, సాంకేతికపరమైన దూకుడును మాస్కో సమర్థంగా ప్రతిఘటించింది. వాటి తీరుతో మేము కోల్పోయింది ఏమీ లేదు. కోల్పేయేదీ ఏమీ ఉండదు. కానీ మా సార్వభౌమాధికారం మరింత విస్తృతం కాబోతోంది. ఈ ఫలితం అనివార్యం అని పుతిన్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పౌరులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తాము సైనిక చర్యకు దిగినట్టు చెప్పారు. తాజా పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ 2 శాతం కుంచించుకుపోయినా, దేశంలో ఆర్థిక స్థిరత్వం నెలకొందని, ధరలు, నిరుద్యోగం తగ్గాయని పుతిన్ పేర్కొన్నారు.