భారత్ జోలికి వస్తే ఊరుకునేది లేదని పాకిస్తాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా హెచ్చరించారు. మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భారత చక్రవర్తుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ను ఎందుకు అస్థిర పర్చాలని, విభజించాలని చూస్తుందో నేరుగా పాక్‌నే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ నేతల మాటలు, చేతల మధ్య తేడాలు ఉండటంతో ప్రజలు వారిని విశ్వసించడం మానేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం దీన్ని ఒక సవాలుగా తీసుకుందని, ప్రజల విశ్వాసం కోల్పోయే పరిస్థితులు రాకుండా చేస్తామని తెలిపారు. తామే ఏం చెబుతామో, అది చేసి చూపిస్తామని అన్నారు. గతంలో ఎయిర్‌స్ట్రైక్, సర్జికల్ స్టైక్ లేవు. కానీ మేం చేసి చూపించాం. భారత భూభాగంలోనే కాదు, సరిహద్దు దాటైన సరే ఉగ్రవాదులను మట్టుబెడతామని పాక్‌కు గట్టి సందేశాన్ని ఇచ్చాం అని గుర్తు చేశారు.