న్యూజిలాండ్ తదుపరి ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారయింది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార లేబర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి హిప్కిన్స్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌కు ఈ నెల 22న జరుగనున్న సమావేశంలో పార్టీ ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే కేవలం ఒకే నామినేషన్ రావడంతో తదుపరి ప్రధానిగా 44 ఏండ్ల హిప్కిన్స్ ఎన్నికైనట్లు లేబర్ పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన దేశ 41వ ప్రధానిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14న జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఆయన సారధ్యం వహించనున్నారు.