గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహ సభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ధరమ్ బీర్ గోకుల్‌ను అశ్వరథంపై మహా సభల ప్రధాన వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. అనంతరం సభలో ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడారు. ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గోకుల్ చెప్పారు. తెలుగు మహాసభలు, భాష, నాగరికతను మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల నిర్వహణ ఆంధ్ర సారస్వత పరిషత్తు దూరదృష్టికి నిదర్శనం అని చెప్పారు. తెలుగు భాష సంస్కృతిని ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచానికి మార్గదర్శకం గా నిలిపారన్నారు. భారత్‌లో తెలుగు మూడో అత్యధిక మంది మాట్లాడే భాషగా ఉందన్నారు.

తెలుగు భాష సంస్కతృతి ప్రవాసుల అంతర్భాగంలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, మారిషస్‌లో కూడా అంతే ప్రాముఖ్యం ఉందని ధరమ్ బీర్ గోకుల్ పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కూడా ఎంతో వైభవంగా ఉగాదిని నిర్వహించుకుంటారని, మారిషస్‌లో సెలవు దినంగా ఉందని చెప్పారు.
మహాసభ తెలుగు ప్రవాసుల గుర్తింపును తెలుపుతోంది. ఇది ఖండాల మధ్య అనుసంధానం పెంపొందిస్తోంది. ఇక్కడ జరిగిన చర్చల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు గుర్తింపును బలపరుస్తాయి. భారత్, మారిషస్‌ల మధ్య సంబంధం ఉమ్మడి చరిత్ర, విలువలతో కలిగి ఉంది. పూర్వీకులు భారత పుణ్యభూమి నుంచి వచ్చి భాషలను పరిరక్షించారు. సంప్రదాయాలను కాపాడి తరతరాల పాటు వాటిని కొనసాగించారు అని అన్నారు.















