శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధానిగా ఉన్న సోదరుడు మాహింద రాజపక్సను మార్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మధ్యంతర ప్రభుత్వ ప్రతిపాదనలో పేర్కొన్నారని ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. అధ్యక్షుడితో భేటీ అనంతరం మైత్రిపాల మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రధాని ఎంపిక కోసం నేషనల్ కౌన్సిల్ ఏర్పాటుకు గొటబయ్య సంసిద్ధత వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లోని అన్ని పార్టీలతో కూడిన క్యాబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు.