అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొన్న ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవంతులు, ఆఫీసు స్థలాలు విక్రయాలు లేక ఘోస్ట్ హౌస్ లుగా మారుతున్నాయి. అమ్మకాలు భారీగా పతనమవ్వడంతో రియల్టర్లు డిస్కౌంట్ల బాట పడుతున్నారు. 50 శాతం మేర రాయితీ ప్రకటిస్తున్నారు. మన్‌హట్టన్‌లో ఓ బ్రోకర్ ఓ భారీ భవంతిని 50 శాతం డిస్కౌంట్‌తో ఇటీవల కొనుగోలు చేశాడు. లాస్‌ఏంజెల్స్‌లో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని ఓ వ్యక్తి పదేండ్ల కిందట కొనుగోలు చేశాడు. గత డిసెంబర్‌లో దాన్ని కొన్న ధర కంటే 45 శాతం తక్కువకు విక్రయించాడు.
కరోనా సృష్టించిన విలయం అమెరికాపై తీవ్రంగా పడింది. వాణిజ్య కార్యకలాపాలే కాదు రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా గణనీయంగా పడిపోయాయి. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత విక్రయాలు ఊపందు కొంటాయనుకొన్న రియల్టర్ల అంచనాలు తారుమారయ్యాయి. ఆర్థిక సంక్షోభ భయాలు, కరోనా నేర్పించిన ఆరోగ్య సంరక్షణ పాఠాలతో వైద్య ఖర్చులకు బడ్జెట్‌ను పెద్దమొత్తంలో కుటుంబాలు కేటాయించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఆఫీసు స్పేస్‌లకు గిరాకీ తగ్గడం వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై పెను ప్రభావం పడింది.
కరోనాకు ముందు బ్యాంకుల నుంచి వడ్డీకి పెద్ద మొత్తంలో రుణాలను తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ భవనాలను నిర్మించాయి. విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంతో బ్యాంకు బకాయిలను చెల్లించాలను కొన్నాయి. కానీ, కరోనా తర్వాత కొనుగోలుదారుల నుంచి ఆశించిన మేర స్పందన రావట్లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగసాగింది. దీంతో చేసేదేమీ లేక నిర్మాణం ఖర్చుల కంటే తక్కువ మొత్తాలకే విక్రయాలు జరుగుతున్నాయి. అమెరికాలోనే కాకుండా జర్మనీ వంటి ఐరోపా దేశాలతో పాటు భారత్‌లోనూ రియల్ ఎస్టేట్ కుదేలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్టు నిర్మాణరంగ నిపుణులు చెబుతున్నారు.