కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కోకాపేట నియో పోలిస్ భూములకు ఉదయం వేలం ప్రారంభం కాగా, రాత్రి 8 గంటల వరకు వేలం కొనసాగింది. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది.
నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. 10వ నెంబర్ ప్లాట్‌లోని ఎకరం భూమి ధర అత్యధికంగా రూ. 100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10వ నెంబర్ ప్లాట్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప, , హ్యాపీ హైట్స్ కలిసి రూ. 362.70 కోట్లకు దక్కించుకున్నాయి. 7.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 11వ ప్లాట్‌లో ఎకరం ధర అత్యల్పంగా రూ. 67.25 కోట్లు ధర పలికింది.
కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2లో 45.33 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. తొలి సెషన్‌లో ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం నిర్వహించగా, రెండో సెషన్‌లో 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో షాపూర్ జీ పల్లోంజి, ఎన్‌సీసీ, మైహోం, రాజ్‌పుష్ఫ తదితర ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం.