కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దాంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు.

కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల బలం అవసరం. అయితే లిబరల్ పార్టీకి 167 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే ఐదు సీట్లు తక్కువయ్యాయి. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో మార్క్ కార్నీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
