రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్‌కు 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తెలింది. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ 24 ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగింపజేసుకోవాలని పుతిన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చివరిరోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఫీుభావం ప్రకటించాలని దివంగత విపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకుంది. కొన్ని చోట్ల బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకు, ఆకుపచ్చ రంగు యాంటీసెస్టిక్ ద్రావణాలను పోసేశారు. 16 నగరాల్లో 65 మంది నేతలు అరెస్టయ్యారు. బెర్లిన్, పారిస్, మిలన్ తదితర నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున ఓటర్ల సందడి కనిపించింది.