అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం పెంచారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో సహనా సహనా అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. తమన్ స్వరకర్త. సహనా సహనా..నా సఖి సహనా.. కలలో నిన్నే చూశానా, సహనా సహనా అతిశయ సుగుణా మనసే నీకే రాశానా.. తోడులేక నిన్నా మొన్నా కుదురుగా వేచి ఉన్నా, ఎదురుగా నువ్వే వచ్చేశాక దిగులిక చూసేనా, నా వధువిక నువ్వే అంటూ నేనే ముడులను వేసేనా అంటూ భావయుక్తంగా ఈ పాట సాగింది.

తమన్ మెలోడీ ప్రధానంగా సమకూర్చిన బాణీ, విజువల్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఈ పాటలో ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీ అద్భుతమైన స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నామని, జనవరి 8న ప్రీమియర్‌షోస్ ప్రదర్శిస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.















