మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం డిసెంబర్ ఐదో తేదీన కొలువు దీరనున్నది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయం వెల్లడించకున్నా, ముంబైలోని ఐకానిక్ అజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర కొత్త సీఎంతో కూడిన మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది. ఈ సంగతి బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే ప్రకటించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 132, ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని శివసేన 57, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మహా యుతి కూటమి 230 స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లకు పరిమితం కాగా, ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని శివసేన 20, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 సీట్లకు పరిమితం అయ్యాయి. విపక్ష మహా వికాస్ అఘాదీ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి.