
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను ఆమె వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని వివరించారు. ఉప సర్పంచ్ ఎన్నికను కూడా అదే రోజు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని పేర్కొన్నారు.
















