అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన పుష్ప-2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో చిత్ర బృందం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. మనిషిలేని లోటును ఎవరూ తీర్చలేరు. అందుకు మేమంతా ఎంతగానో విచారిస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను అన్నారు.
ఈ సినిమా సక్సెస్ విషయంలో పూర్తి క్రెడిట్ సుకుమార్‌దే. ఆయన వల్లే ఆ స్థాయి విజయం సాధ్యమైంది. కలెక్షన్స్ గురించి తెలుసుకుంటుంటే సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతున్నది. ఈ సినిమా విషయంలో మాకు సహాయాన్నందించిన అన్ని ఇండస్ట్రీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనందరిని గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే ఈ సినిమా తీశాం అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ నా కెరీర్‌పరంగా సినిమాపరంగా కృతజ్ఞతలు చెపాల్సింది తొలుత రాజమౌళికే. ఆయన పట్టుబట్టడం వల్లే పుష్పను హిందీలో విడుదల చేశాం. మాది పాన్ ఇండియా సినిమా అని నమ్మింది, మాకు నమ్మకాన్ని ఇచ్చింది ఆయనే. వాస్తవానికి గత మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. థియేటర్ వద్ద జరిగిన ఘటనతో నా మనసు వికలమైంది. వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాం అని చెప్పారు.