భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ దివంగత పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. భావితరాలు ఆయన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలు కూర్చునే లాంజ్‌లో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్, ప్రొటెం చైర్మన్‌తో పాటు పలువురు పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండే రంగులను ఉపయోగించడం, జీవం ఉట్టిపడేలా చిత్ర పటాన్ని రూపొందించడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేశవరావు, ఎమ్మెల్సీ వాణిదేవీ, మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, గణేశ్ బిగాల, భట్టి విక్రమార్క, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, పీవీ కుటుంబ సభ్యులు ప్రభాకర్‌రావు, శారదాదేవీ, అజిత్, డాక్టర్ యాదవి, శేఖర్, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.