ప్రముఖ తెలుగు వైద్యునికి అరుదైన గౌరవం దక్కింది. ది పిడియాట్రిక్ అండ్ కంజెనిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియో వాస్క్యులర్ సొసైటీ (పీఐసీఎస్) వ్యవస్థాపక పరిశోధకునిగా ప్రముఖ చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స నిపుణులు డాక్టర్ నాగేశ్వరరావు కొనేటి నియమితులయ్యారు. పుట్టుకతోనే గుండె వ్యాధులు ఉన్న శిశువులకు పీఐసీఎస్ సహాయపడుతోంది. తక్కువ కోత పద్ధతులు ఉపయోగించి చికిత్స అందించడంలో ఈ సొసైటీ ముందుంది. అనుభవం, నైపుణ్యంతో పాటు పేషెంట్ కేర్, అభ్యాసం, పరిశోధనలపై కృషి చేసే వారికి ఈ ఫెలోషిప్ అందిస్తుంటారు.
డాక్టర్ నాగేశ్వరరావు ప్రస్తుతం రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. గుండెలోని రెండు జరరికల మధ్య రంధ్రం (వెంట్రిక్యూలర్ సెప్టల్ డిఫెక్ట్) మూసి వేయడానికి రెట్రో గ్రేడ్ టెక్నిక్‌ను ఈయన గతంలో అభివృద్ధి చేశారు. తల్లి కడుపులో ఉండగానే శిశివు గుండెకు చికిత్సలు చేయడంతోపాటు ఇతర పద్ధతులను ఆవిష్కరించారు.