అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చిచ్చు రేగింది. వలస విధానాలపై ఆయన అనుచరులు రెండుగా చీలారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి ఒక వర్గం మద్దతు ఇవ్వగా, కఠినమైన వలస విధానాలను అమలు చేయాలని మరో వర్గం వాదిస్తున్నది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించిన నాటి నుంచి ఈ వివాదం మొదలయ్యింది. ఇతర దేశాల నిపుణు లకు ఇచ్చే గ్రీన్‌కార్డులపై పరిమితులు తొలగిస్తే బాగుంటుందని శ్రీరామ్ కృష్ణన్ అభిప్రాయపడటం వివాదానికి ఆజ్యం పోసింది.
ట్రంప్‌కు కీలక మద్దతుదారుగా ఉన్న ఎలాన్ మస్క్ సైతం ప్రతిభ గల ఇతర దేశాల నిపుణులకు అమెరికా వీసాలు దక్కాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మస్క్ అభిప్రాయానికి ట్రంప్ శిబిరంలోని భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి మద్దతు ఇచ్చారు. వీరిపై పలువురు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ద్వేషపూరిత, జాత్యాంహంకారం కలిగిన మూర్ఖులను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.