నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం దసరా. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి నానితో ఈ సినిమా చేయాలని మూడేళ్లుగా ఎదురుచూశామని, దేశమంతా మెచ్చే చిత్రమిదని పేర్కొన్నారు. భాషా భేదాలతో సంబంధం లేకుండా అందరు మెచ్చే చిత్రమిదని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. నాని మాట్లాడుతూ దసరా చిత్రం థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నదని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చేసిన పర్యటనలతో అర్థమైంది అన్నారు. రిలీజ్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. నన్ను, కీర్తి సురేశ్‌ను మర్చిపోయి మేము పోషించిన ధరణి, వెన్నెల పాత్రల్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ కొత్త ప్రపంచాన్ని చూపించాడు. తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతంతో పాటు పాన్ ఇండియా సెలబ్రేట్ చేసుకునే చిత్రమిది అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని కథానాయిక కీర్తి సురేశ్ తెలిపింది. దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది అని తెలిపారు. ఈ నెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది.
