పాకిస్థాన్‌లో గత ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా వేదిక ఎక్స్ వినియోగం రద్దు కొనసాగుతుండడంపై సింధ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారం రోజుల్లో ఆ రద్దును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని అంత ర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించింది. దీనిపై దాఖలైన అనేక పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అక్వీల్ అహ్మద్ అబ్బాసీ మాట్లాడుతూ ఇలాంటి వాటిని రద్దు చేయడం వల్ల ఏం సాధించా రు? మనల్ని చూసి ప్రపంచం నవ్వుకుంటుంది అని వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు బెదిరింపులు వస్తున్నా యంటూ గత ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌ను రద్దు చేస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ, నిఘా ఏజెన్సీలు నుంచి జారీ అయిన ఆదేశాల మేరకు సోషల్ మీడియా ఎక్స్ ను నిలిపివేశామని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పిటిఎ) కోర్టుకు గతనెల తెలియజేసింది.
వేరే కేసులో ఇంటెర్నెట్‌లో అప్‌లోడ్ అయ్యే సమాచారం దేశభద్రతకు ముపుగా ఉంటోందని ఇస్లామాబాద్ హైకోర్టుకు పిటిఎ తెలియజేసింది. రద్దు చేస్తూ ఫిబ్రవరి 17న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందని చీఫ్ జస్టిస్ ఘాటుగా చెప్పారు. ఈ కేసు విచారణను మే 9కు వాయిదా వేశారు. ఎక్స్‌ను రద్దు చేయడానికి దారి తీసిన కారణాలతో ఆరోజు కోర్టుకు హాజరు కావాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు చీఫ్ జస్టిస్ ఆదేశించారు.