అమెరికాకు చెందిన పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఉగ్రవాదానికి మద్దతునివ్వడం లేదా ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని ప్రకటించింది. గ్రీన్ కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం షరతులతో కూడిన సౌలభ్యం అని, అంతేకానీ హక్కు కాదని స్పష్టం చేసింది.

అమెరికాకు రావడం వీసా పొందడం లేదా గ్రీన్ కార్డు లభించడం ఓ గౌరవం. మా చట్టాలను, విలువలను తప్పనిసరిగా గౌరవించాలి. మీరు హింసకు సహకరించినా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా మద్దతు తెలిపినా లేదా ఇతరులను అందుకు పురికొల్పినా మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు అని పేర్కొంది. గ్రీన్ కార్డు పొందిన ఇతర దేశాల పౌరులు ఇకపై అమెరికాలో చట్టబద్ధమైన పౌరులుగా శాశ్వతంగా నివసించవచ్చు. ప్రస్తుతం అమెరికాలో 1.8 కోట్ల మంది గ్రీన్‌కార్డు పొందినవారు ఉన్నారు.
