ఉక్రెయిన్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ సమస్య ఉత్పన్నమైందని, ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పుతిన్ అంతర్జాతీయ విధాన నిపుణుల సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై మాస్కో అణుదాడి చేస్తుందన్న ఆలోచన అర్థరహితం. రాజకీయంగా, సైనికపరంగా అంతటి చర్యకు దిగాల్సిన అవసరమే లేదు. మానవాళి ముందు ఇప్పుడు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందరికీ చేటుచేసే సమస్యలను కొనితెచ్చుకోవడం. ఆదర్శవంతమైనవి కాకపోయినా ప్రపంచం స్థిరంగా, భద్రంగా కొనసాగేందుకు దోహదపడే పరిష్కారాలను కనుగొనడం. పశ్చిమ దేశాలకు రష్యా శత్రువేమీ కాదు. కానీ మా దేశాన్ని లొంగదీసుకునేందుకు అవి ప్రదర్శిస్తున్న నియంతృత్వ పోకడలు, విధానాలను మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. సోవియట్ హయాంలో, కమ్యూనిస్ట్ నేతల ద్వారా రష్యా భూభాగాలను అందుకుని ఉక్రెయిన్ కృత్రిమ దేశంగా అవతరించింది. మా రెండు దేశాల ప్రజలు ఒకే జాతికి చెందినవారు అని పేర్కొన్నారు.
