అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం అందించిన డేటా ఆధారంగా లండన్‌కు చెందిన గ్లోబల్ పౌరసత్వం, నివాస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ 2023 ఏడాదికి గానూ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 199 దేశాలతో కూడిన ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌దారులు ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా నిలిచాయి. ఇక మూడో స్థానంలో ఉన్న జర్మనీ, స్పెయిన్ నిలిచాయి. ఆ తర్వాత నాల్గో ర్యాంకులో ఫిన్లాండ్, ఇటలీ, లగ్సెంబర్గ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఐదో స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడెన్ నిలిచాయి.
ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, బ్రిటన్ వంటి దేశాలు వీసా రహిత జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాయి. అమెరికా, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన జాబితాలో ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, వరెస్ట్ పాస్‌పోర్ట్ జాబితాలో టాప్-5లో ఆఫ్గనిస్థాన్, ఇరాక్, సీరియా, పాకిస్థాన్, యెమెన్ ఉన్నాయి. ఈ నివేదికలో భారతీయ పాస్‌పోర్ట్ 85వ స్థానంలో ఉంది. గతేడాది 83వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 85వ స్థానంలో కొనసాగుతోంది. భారత పాస్పోర్టుతో ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా-ఫ్రీ ప్రయాణానికి వెసులుబాటు ఉంది. భారత పాస్‌పోర్ట్‌దారులు భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, మకావో, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, కెన్యా, మారిషస్, సీషెల్స్, జింబాబ్వే, ఉగాండా, ఇరాన్, ఖతార్ వంటి 59 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీటిల్లో కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది.