వీసా జారీలను ఇటీవల కఠినతరం చేసిన అమెరికా తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనను తీసుకొచ్చింది. వీసా దరఖాస్తుదారులు గత ఐదేండ్లలో వారు ఉపయోగించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూజర్ నేమ్‌ను, హ్యాండిల్‌ను బహిర్గతం చేయాలని సూచించింది. తమ సోషల్ మీడియా ఖాతాల విషయాన్ని గోప్యంగా ఉంచితే వారి వీసా దరఖాస్తును తిరస్కరిస్తామని హెచ్చరించింది. వీసా కోసం నింపే డీఎస్-160 దరఖాస్తు ఫారంలో గత ఐదేండ్ల నుంచి వారు ఉపయోగించిన ప్రతి ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యూజర్‌నేమ్, హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విస్మరిస్తే వీసా తిరస్కరణకు గురికావడమే కాకుండా భవిష్యత్తులోనూ వీసా అనర్హతకు దారితీయవచ్చని హెచ్చరించింది.

ఎఫ్, ఎం, జే నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాల గోప్యతా సెట్టింగ్‌లను పబ్లిక్‌కు మార్చుకోవాలని ఈ నెల 23న యూఎస్ రాయబార కార్యాలయం కోరింది. 24న విడుదల చేసిన మరో ప్రకటనలో ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తే నిర్బంధించడంతోపాటు బహిష్కరణకు గురికావాలసి వస్తుందని, భవిష్యత్తులో వీసా అవకాశాలు మూసుకుపోతాయని హెచ్చరించింది.
