పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన యూరోపియన్ యూనియన్, ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు భారత్‌కు ఉన్న హక్కును సమర్థించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో ఈయూ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. పహల్గాం దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిందేనని ఈయూ స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఎప్పటికీ సమర్థనీయం కాదు. దాడికి బాధ్యులైన వారిని న్యాయపరంగా శిక్షించాలి. ఉగ్ర చర్యల నుంచి తమ పౌరులను రక్షించుకునే హక్కు ప్రతి రాజ్యం బాధ్యతతోపాటు హక్కు అని ఈయూ తన ప్రకటనలో తెలిపింది.

రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఉభయ పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సయంమనం పాటించాలని, రెండు వైపులా పౌరుల ప్రాణాలను పరిరక్షించుకునేందుకు దాడులు కొనసాగించరాదని ఈయూ విజ్ఞప్తి చేసింది. భారత్, పాక్ చర్చలు చేపట్టాలని కోరిన ఈయూ అంతర్జాతీయ చట్ట నిబంధనలకు లోబడి రెండు దేశాలు తమ పౌరుల జీవితాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కోరింది.
