అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది అధికారికంగా ఆ దేశానికి క్యూ కడుతున్నారు. అయితే వీరికి తోడు అక్రమ వలసదారులు కూడా పెద్ద ఎత్తున చొరబడుతుండటం ఆ దేశ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో అక్రమ వలసదారులకు ఆవాసం కల్పించడం అధికారులకు సమస్యగా మారింది. గత ఏడాది న్యూయార్క్‌లో 1,18,000 మంది అక్రమ వలసదారులు రాగా, వీరిలో 60 వేల మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంటున్నారు. అయితే వీరి ఇతర అవసరాలను తీర్చడం అధికారులకు ఇబ్బందిగా మారింది. తమ మానవతా వైఖరి న్యూయార్క్ నగరాన్ని నాశనం చేస్తున్నదని మేయర్ ఎరిక్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు.
