నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కథానాయిక నటించిన చిత్రం అనగనగా ఒకరాజు. మారి దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీనాక్షి చౌదరి విలేకరులతో ముచ్చటించింది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో మరిచిపోలేని విజయం అందుకున్నాను. ఈ ఏడాది మళ్లీ సంక్రాంతికి అనగనగా ఒకరాజు తో వస్తున్నా. తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నా నమ్మకం అని ఆశాభావం వెలిబుచ్చింది. ఇందులో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రికి గారాలపట్టి, ఇంట్లో యువరాణి. సున్నితమైన మనసు కలిగిన మంచి అమ్మాయి. కాస్త అమాయకత్వం కూడా ఉంటుంది. నా కాలేజ్ టైమ్‌లో ఇలాంటి ఒకరిద్దరు అమ్మాయిల్ని చూశాను. నా రియల్ నేచర్‌కి ఇది పూర్తి భిన్నమైన పాత్ర. అందుకే చాలెంజ్‌గా తీసుకొని చేశాను అని తెలిపింది.

నవీన్ పొలిశెట్టి ఓ సినిమా టీచింగ్ స్కూల్. తనతో పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో తొలిసారి పూర్తి కామెడీ రోల్ చేశా. నటిగా నన్ను మరింత రాటుదేలేలా ఈ పాత్ర చేసింది. లక్కీభాస్కర్ లో సుమతి, ఇందులోని చారుతల, ఇలా పొంతనలేని పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మారి క్లారిటీ ఉన్న దర్శకుడు. అందరికీ నచ్చేలా సినిమాను తీశారు. ఇక సితార సంస్థ నా కుటుంబం లాంటిది. నన్ను నటిగా నిలబెట్టిందే ఈ సంస్థ. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని నమ్మకం వ్యక్తం చేసింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది.















