యష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ ఎండింగ్. కౌశిక్ భీమిడి దర్శకత్వం. ఈ సందర్భంగా యష్ పూరి పాత్రికేయులతో మాట్లాడుతూ మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. నేటితరం యువకుడు శాపం బారిన పడితే అతని పరిస్థితి ఏమిటనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం. సినిమాలో నా పాత్ర పేరు హర్ష్. శాపాల వల్ల తను ఇబ్బందిపడుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. చివరి 15 నిమిషాలు మాత్రం భావోద్వేగభరితంగా అనిపిస్తాయి అన్నారు.
ఈ సినిమాలో ఎలాంటి అడల్డ్ కంటెంట్ ఉండదని, ఫ్యామిలీతో కలిసి హాయిగా సినిమా చూడొచ్చని చెప్పారు. ఇక ప్రేమ అనే అంశాన్ని కూడా కవితాత్మక, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా చూపించా మని అన్నారు. ప్రేమ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో శాపగ్రస్తుడు కాబట్టి అతని ప్రేమ వ్యక్తీకరణ పొయెటిక్ ఫీల్‌తో ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, డ్రామా ఇలా అన్ని అంశాలు కలిగిన ధమ్ బిర్యాని లాంటి సినిమా ఇది అని యష్ పూరి తెలిపారు. కమర్షియల్ హీరోగా రాణించాలన్నదే తన లక్ష్యమని, కెరీర్లో కాస్త స్థిరపడిన తర్వాత పక్కా మాస్ సినిమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 2న విడుదలకానుంది.