ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే ఏ కార్యక్రమైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రగతికి చిహ్నంగా , అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశం గర్వపడేలా ఉంటున్నాయని పేర్కొన్నారు.
నూతన సచివాలయ భవనం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపొందిందని అన్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను నిత్యం స్మరించుకొనేలా సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మితమవుతున్నదని వెల్లడించారు. బీఆర్ అంబేద్కర్ పేరును సార్థకం చేసేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టడం, అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం తెలంగాణ సమాజానికే గర్వకారణమని తెలిపారు.