చైనా ఆమోదించిన కొత్త భూ సరిహద్దు చట్టం పై స్పందించిన భారత విదేశాంగ శాఖ ఇది ఏకపక్ష నిర్ణయంగా అభివర్ణించింది. సరిహద్దు నిర్వహణతో పాటు సంబంధిత సమస్యలు, ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య ఎల్‌ఏసీ వెంట సరిహద్దు వివాదం ఆపరిష్కృతంగా ఉండడం భారత్‌కు ఆందోళనకరమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ఏకపక్ష చర్యల ప్రభావం ఇప్పటికే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ఉండబోదన్నారు. ఇరు దేశాల మద్య సరిహద్దు వివాదంపైన అయినా, సరిహద్దు ప్రాంతాల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ప్రశాంతత, శాంతి, సామరస్యాల నిర్వహణపైన అయినా ఈ కొత్త చట్టం ప్రభావం ఉండబోదని వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చగలిగే ఏదైనా చర్యను ఈ కొత్త చట్టం సాకుతో చేపట్టడం చైనా మానుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.