రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. మానస కథానాయిక. రవికాంత్ పేరేపు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నేపథ్యంలో ప్రీబుకింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో అడివి శేష్, విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ కొడుకు హీరోగా లాంచ్ అవుతుంటే పేరెంట్స్ కళ్లలో ఓ ఆనందం ఉంటుంది. అది సుమ, రాజీవ్ కళ్లలో కనిపిస్తున్నది.రోషన్ పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఈ సినిమాలో రోషన్ నటన చూస్తుంటే కొత్తవాడిలా అనిపించడం లేదని హీరో విశ్వక్‌సేన్ అన్నారు. రోషన్ కనకాల మాట్లాడుతూ ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. మనందరి నసీబ్‌లో ఏం రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్లు మార్చుకోవాలి అనే స్ఫూర్తివంతమైన సందేశం ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా ఈ కథ బాగా నచ్చుతుందని, రోషన్ ఈ సినిమాతో పెద్దహీరోగా అవతరిస్తాడని దర్శకుడు రవికాంత్ పేరేపు నమ్మకం వెలిబుచ్చారు. యువతకు సందేశాన్నందించే కథ ఇదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.