నాటో కూటమిలో 32వ సభ్యదేశంగా స్వీడన్ అధికారికంగా చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగడంతో దశాబ్దాల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరింది. స్వీడన్ చేరిక వల్ల యునైటెడ్ స్టేట్స్, మిత్ర దేశాలు మరింత సురక్షితమయ్యాయని వైట్‌హౌస్ పేర్కొన్నది. గతేడాది నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరిక తర్వాత ఇప్పుడు స్వీడన్ చేరింది. గత కొన్నేళ్లుగా నాటో సభ్య దేశాలైన టర్కీ, హంగేరిలు అభ్యంతరం తెలుపటంతో స్వీడన్ సభ్యత్వం నిలిపివేశారు.
తీవ్రవాదులుగా పరిగణించే కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ ఆశ్రయం కల్పిస్తున్నదని టర్కీ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. కొన్ని నెలల వ్యత్యాసంతో అటు టర్కీ, ఇటు హంగేరి రెండూ నాటో కూటమిలో స్వీడన్ ప్రవేశానికి ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా స్వీడన్ ప్రధాని మాట్లాడుతూ ఇది చారిత్రక దినమని, స్వేచ్ఛకు లభించిన విజయమని పేర్కొన్నారు.