ఉక్రెయిన్‌పై చేస్తున్న దండయాత్రలో రష్యా సైనికులు అత్యాచారాలు, లైంగిక వేధింపులను ఆయుధంలా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిల, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలన్న అంశంపై లండన్‌లో ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి లైంగిక హింసకు పాల్పడడం అత్యంత క్రూరమైన మార్గం. యుద్ధాల సమయంలో ఇలాంటివి జరిగినా భయంతో బాధితులు ఆ విషయాలను బయటపెట్టలేరు. ప్రస్తుతం మా దేశంలో వారు ( రష్యన్ బలగాలు) ప్రయోగిస్తున్న మరో ఆయుధం ఇదే. లైంగిక దాడులకు పాల్పడుతున్న విషయాన్ని రష్యన్ సైనికులు వారి బందువులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన అకృత్యాలను ఇవి గుర్తు చేస్తున్నారు అని అన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. ఇలాంటి యుద్ధ నేరాలకు పాల్పడేవారిని గుర్తించి, శిక్ష విధించాలన్నారు.
