బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాసులకు ఇది గుడ్‌న్యూస్. త్వరలోనే అక్కడ కనీస వేతన చట్టంలో సవరణలు జరిగే అవకాశం ఉందని లేబర్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరిసారిగా ఆ దేశ కనీస వేతనాన్ని 2015 జనవరి 1న సవరించారు. ఆ తర్వాత ఎలాంటి సవరణలు చోటు చేసుకోలేదు. దాంతో అక్కడ పనిచేస్తున్న ప్రవాస కార్మికులు చాలా తక్కువ జీతానికే పనిచేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న 71శాతం మంది ప్రవాసులు ప్రస్తుతం నెలకు 200 బహ్రెయినీ దినార్ల (రూ.43వేలు) కంటే కూడా తక్కువ సంపాదిస్తున్నారు. ఆ దేశంలో వలస కార్మికులకు కనీస వేతన చట్టం లేదు. దీంతో కార్మికులకు చెల్లించే కనీస వేతన రేటు విషయంలో స్పష్టత ఉండదు. కానీ, ప్రభుత్వ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ప్రస్తుతం కనీస వేతనం 300 బహ్రెయినీ దినార్లుగా(రూ.65వేలు) ఉంది.